ఏపీలో పదో తరగతి క్వశ్చన్ పేపర్ లీక్ సంచలనంగా మారింది. టెన్త్ పేపర్ వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అయ్యింది. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. పలు చోట్ల కేసులు నమోదు చేశారు. కొందరు విద్యార్థులను డిబార్ చేశారు. ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.
పదో తరగతి పరీక్షల్లో అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజా వాట్సప్‌లో పదో తరగతి పేపర్ లీక్ చేసిన ఘటన కలకలం సృష్టిచించింది. దీంట్లో భాగస్వామ్యమైన వారిపై కేసుల నమోదు అయ్యాయి. ఉపాధ్యాయులు సస్పెండ్ అయ్యారు. విద్యార్థులు డిబార్ జరిగిన ఘటనలు ఉన్నాయి. తాజాగా కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బి కేంద్రంలో పదో తరగతి గణితం ప్రశ్నా పత్రం వాట్సప్‌లో లీకైంది.
వాట్సప్‌లో క్వశ్చన్ పేపర్..
సోమవారం గణితం పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల వ్యవధిలోనే.. ఫోనుల్లో ప్రశ్నపత్రం దర్శనమివ్వడంతో చర్చనీయాంగా మారింది. అడ్డదారిలో ఫలితాలు సాధించాలనే లక్ష్యంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల అక్రమాలకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. ఒక వ్యక్తి కడప జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈవో) షంషుద్దీన్‌కు సమాచారం అందించారు. దీంతో ఆ ప్రశ్నపత్రంలోని క్యూఆర్ కోడ్‌ను పరిశీలించారు. అది వల్లూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం నుంచి లీక్ అయినట్లు గుర్తించారు.
ఫొటో తీసిన వాటర్ బాయ్..
వెంటనే అక్కడికి వెళ్లి అధికారులు పరిశీలించారు. పరీక్ష మొదలైన నిమిషాల వ్యవధిలో వాటర్ బాయ్ సాయి మహేష్ విద్యార్థుల వద్ద నుంచి ప్రశ్నపత్రం తీసుకుని, దాన్ని ఫొటో తీసి వాట్సప్‌లో వివేకానంద పాఠశాలలో పనిచేస్తున్న విఘ్నేశ్వరరెడ్డికి పంపించాడు. ఆయన వేంపల్లిలోని కొంతమంది ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్లకు చేరవేశాడని బయటపడింది. విఘ్నేశ్వరరెడ్డి ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడిగా అనుమానిస్తున్నారు.
డీఈవో సీరియస్..
ఈ పాఠశాలలో పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజు నుంచీ ఇదే తంతు నడుస్తోంది. వల్లూరు మండలంలో ఒకటి, వేంపల్లె మండలంలో రెండు ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ల అండతో ఈ అక్రమాలు జరుగుతున్నాయి. ప్రశ్నపత్రం లీకు వ్యవహారంలో చీఫ్ సూపరింటెండెంట్ ఎం.రామకృష్ణమూర్తి, డిపార్ట్‌మెంట్ అధికారి ఎన్. శ్రీనివాస్‌రెడ్డి, ఇన్విజిలేటర్ ఎం.రమణలను డీఈవో షంషుద్దీన్ సస్పెండ్ చేశారు. దీనిపై సీరియస్ అయిన డీఈవోపై బెదిరింపులకు దిగారు. ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై విచారణ జరపాలని.. కమలాపురం ఎస్ఐని కోరినట్లు పరీక్షల విభాగం డైరెక్ట్ శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. వాటర్ బాయ్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
సత్యసాయి జిల్లాలో స్లిప్పులు..
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని బాలిక ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు పరీక్ష కేంద్రాలను, ముదిగుబ్బ న్యూటౌన్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా పరీక్షల పరిశీలకులు జేడీ సుబ్బారావు తనిఖీ చేశారు. కదిరి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏ, బీ కేంద్రాల్లో కిటికీల దగ్గర స్లిప్పులు కనిపించాయి. పరీక్షలు జరుగుతున్న రూముల వెనుకబాగంలో ప్రింటెడ్, చేతితో రాసిన గణితం స్లిప్పులు, మరుగుదొడ్డిలో స్లిప్పులు పడి ఉన్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
విధుల్లో నిర్లక్ష్యం..
బయట నుంచి గదుల్లోకి స్లిప్పులు విసరడం, మరికొంత మంది గోడలు దూకి లోపలికి స్లిప్పులు విసురుతున్నట్లు గమనించారు. పరీక్షల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్లను తప్పించారు. కదిరి బాలికల ఉన్నత పాఠశాల కేంద్రంలోని విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఇన్విజిలేటర్లు రుద్రంరెడ్డి, కిష్టప్పలను సస్పెండ్ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులను పరీక్షల విధుల నుంచి తప్పిస్తూ షోకాజ్ నోటీసు ఇచ్చారు. ముదిగుబ్బ న్యూటౌన్ పరీక్ష కేంద్రంలో కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఒక విద్యార్థిని డిబార్ చేసి.. పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు.
తిరుపతి జిల్లాలో మాస్ కాపీయింగ్..
తిరుపతి జిల్లా పుత్తూరులోని ఎస్ఆర్ఎస్ జడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్ కలకలం సృష్టించింది. అక్కడ మాస్ కాపీయింగ్ జరుగుతుందని సమాచారం అందడంతో పాఠశాల విద్యా కడప ఆర్జేడీ శామ్యూల్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎస్ఆర్ఎస్ జడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలోనే ఆయన గంటన్నర పాటు ఉన్నారు. ఆర్జేడీ రావడంతో విద్యార్థులు, ఇన్విజిలేటర్లు అలర్ట్ అయ్యారు. ఆయన ప్రతి రూమ్‌ను 15 నిమిషాల పాటు తనికీ చేపట్టినప్పటికీ ఎవ్వరూ దొరకలేదు. దీంతో ఆ పరీక్షా కేంద్రంలో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు, ఇన్విజిలేటర్లు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.
ఏప్రిల్ 1వ తేదీ వరకు..
ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ పరీక్షలు ముగిశాయి. ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆ లోపు ఎన్ని అక్రమాలు చూడాల్సి వస్తుందోననే చర్చ జరుగుతోంది. అక్రమాలకు చోటు లేకుండా పరీక్షలు నిర్వహించాలని సిద్ధమైన విద్యాశాఖకు.. రోజుకో ఘటన జరగడం తలనొప్పిగా మారింది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ పాఠశాలలో భారీ స్థాయిలో మాల్ ప్రాక్టీస్ జరిగింది. ఈ ఘటనలో 15 మంది అధికారులు, ఇన్విజిలేటర్లు సస్పెండ్‌కు గురయ్యారు. అలాగే ముగ్గురు ప్రధానోపాధ్యాయులకు నోటీసులు జారీ చేశారు.