భారత్‌లో కార్ల విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. అమ్మకాల విషయంలో ప్రధానంగా మూడు కంపెనీలకు చెందిన కార్ల మోడళ్ల హవా నడుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల, గతేడాది (2024) ఫిబ్రవరిలో జరిగిన విక్రయాల గణాంకాల ఆధారంగా కార్ల మోడళ్ల ర్యాంకింగ్స్‌తో ‘ఫోర్బ్స్’ ఒక నివేదికను విడుదల చేసింది. వాటినిలోని టాప్ కార్ల గురించి, వాటిలోని ఫీచర్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
టాప్- 10. టాటా పంచ్ (Tata Punch) : టాటా పంచ్ భారత మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. దీని డిజైన్ ఆకట్టుకునేలా ఉంటుంది. పెద్ద SUVలకు పోటీగా దీనిలో చక్కటి ఇంటీరియర్స్ ఉంటాయి. 5-స్టార్ G-NCAP భద్రతా రేటింగ్‌తో ఈ కారు లభిస్తుంది. భారతదేశంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఇదొకటి. రూ.6 లక్షల నుంచి రూ.10.10 లక్షల ధరల శ్రేణిలో ఈ కారు లభిస్తుంది. టాటా పంచ్‌లో సీఎన్జీ వేరియంట్ కూడా ఉంది.
టాప్- 9. మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) : ఇది భారతదేశ సెడాన్ కార్ల విభాగంలో జోరును కొనసాగిస్తోంది. రూ.6.59 లక్షల నుంచి రూ.9.39 లక్షల ధరల శ్రేణిలో డిజైర్ లభిస్తుంది. మారుతి స్విఫ్ట్‌కు చెందిన సెడాన్ వెర్షన్ అయిన డిజైర్ 1.2 లీటర్ల డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. దీనిలో విశాలమైన క్యాబిన్, ఆధునిక ఇంటీరియర్స్ ఉంటాయి. కొనుగోలుదారులు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5 స్పీడ్ AMTలలో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు. సిటీలో డ్రైవింగ్‌కు అనుగుణంగా ఈ కారు ఉంటుంది. దీని మైలేజీ పెట్రోల్ వెర్షన్లో 22.41 నుంచి 22.61 కి.మీ/లీటర్ ఉంటుంది. సీఎన్జీ వేరియంట్లో 31.12 కి.మీ/కేజీ మేరకు మైలేజీ వస్తుంది.
టాప్- 8. మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) : వీలైనంత ఎక్కువ మంది కూర్చోవడానికి వీలుగా ఉండే కారు మారుతి సుజుకి ఎర్టిగా. ఇందులో ఏడుగురు ప్రయాణికులు కూర్చోవచ్చు. క్యాబ్ ఆపరేటర్లకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనిలో సీఎన్జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఎర్టిగాలో 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఫీచర్లు ఉంటాయి. వీటిలో అవసరమైన దాన్ని కొనుగోలుదారులు ఎంపిక చేసుకోవచ్చు.
టాప్- 7. టాటా నెక్సాన్ (Tata Nexon) : టాటాను కార్ల తయారీ విభాగంలో అగ్రగామిగా నిలుపుతున్న మోడల్ టాటా నెక్సాన్. కాంపాక్ట్ ఎస్యూవీ మార్కెట్లో ఇది ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. రూ.8.10 లక్షల నుంచి రూ.15.50 లక్షల ధరల శ్రేణిలో ఈ కారు లభిస్తుంది. 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ల టర్బో డీజిల్ ఇంజిన్లతో ఈ కారు లభిస్తుంది. 17.18 kmpl నుంచి 24.08 kmpl వరకు ఆకట్టుకునే మైలేజీ వస్తుంది. ఈ కారుకు చెందిన పెట్రోల్ వేరియంట్లో కొత్త 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఫీచర్ ఉంటుంది. నెక్సాన్ ఈవీ అనేది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనం కావడం గమనార్హం.
టాప్- 6. మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) : ఈ కారు మోడల్‌కు SUV విభాగంలో మంచి ఆదరణ లభిస్తోంది. రూ.8.29 లక్షల నుంచి రూ.14.14 లక్షల ధరల శ్రేణిలో ఇది దొరుకుతుంది. 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో ఇది లభిస్తుంది. ఈ కారులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఫీచర్ ఉంటాయి. బ్రెజ్జాను ప్రత్యేకంగా ఉంచేది దానిలోని మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ. ఇది 17.38 నుంచి 19.8 కి.మీ/లీటర్ మైలేజీని సాధించడంలో సహాయపడుతుంది. ఈ కారులోని సీఎన్జీ వేరియంట్‌తో 25.51 కి.మీ/కేజీ మైలేజీ వస్తుంది.
టాప్- 5. మారుతి సుజుకి బలెనో (Maruti Suzuki Baleno) : మారుతి సుజుకి బలేనో ఇంధన సామర్థ్యం విషయంలో మంచి పేరు సంపాదించింది. ఇది 1.2 లీటర్ల డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. 5 -స్పీడ్ మాన్యువల్ లేదా 5 -స్పీడ్ AMTతో ఈ కారు ఇంజిన్ జత చేయబడింది. ఈ కారు సీఎన్జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. దీని పెట్రోల్ వెర్షన్‌తో 22.94 కి.మీ/లీటర్ మైలేజీ వస్తుంది. సీఎన్జీ వెర్షన్‌తో 30.61 కి.మీ/కేజీ మైలేజీ వస్తుంది
టాప్- 4. మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) : 2005లో మార్కెట్లోకి అరంగేట్రం చేసిన మారుతి సుజుకి స్విఫ్ట్, ఇప్పటికీ అమ్మకాల్లో తన జోరును కొనసాగిస్తోంది. విశాలమైన క్యాబిన్, ఇంధన సామర్థ్యం, నమ్మకమైన పనితీరుతో ఇది వాహనదారుల మనసులు గెల్చుకుంది. ఈ కారు మోడల్లోని పెట్రోల్ వెర్షన్‌తో లీటరుకు 22.38 కి.మీ మైలేజీ వస్తుంది. సీఎన్జీ వెర్షన్‌తో 30.90 కి.మీ./కేజీ మైలేజీ వస్తుంది. సిటీ ప్రజలు, సుదూర ప్రయాణాలు చేసే వారు ఈ కారును అత్యుత్తమ ఎంపికగా భావిస్తుంటారు. 2025 ఫిబ్రవరిలో స్విఫ్ట్ విక్రయాలు 24 శాతం పెరిగి 16,269 యూనిట్లకు చేరాయి.
టాప్- 3. హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) : మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా సత్తా చాటుకుంటోంది. భారత్‌లో విక్రయాల పరంగా ఈ కారు మోడల్ మూడో స్థానంలో నిలిచింది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ నుంచి గట్టి పోటీ ఎదురైనా హ్యుందాయ్ క్రెటా సేల్స్ ఏమాత్రం తగ్గలేదు. 2025 ఫిబ్రవరిలో ఈ మోడల్‌కు చెందిన 16,317 కార్లు సేల్ అయ్యాయి. క్రితం ఏడాదితో పోలిస్తే 7 శాతం వృద్ధి నమోదైంది. ఇది రూ.10.87 లక్షల నుంచి రూ.19.20 లక్షల ధరల శ్రేణిలో లభిస్తుంది. ఈ కారులోని వివిధ వేరియంట్లు 17 kmpl నుంచి 23 kmpl దాకా మైలేజీ ఇస్తాయి.
టాప్- 2. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki Wagon R) : భారతీయులకు హాట్ ఫేవరేట్ మారుతి సుజుకి వ్యాగన్ఆర్. ఇందులో 1 లీటర్, 1.2 లీటర్ల సామర్థ్యంతో రెండు రకాల పెట్రోల్ ఇంజన్ వెర్షన్లు ఉన్నాయి. మంచి మైలేజీ కావాలంటే 1 లీటర్ ఇంజిన్‌తో పాటు సీఎన్జీ కిట్ లభిస్తుంది. పెట్రోల్‌తో 25.19 కి.మీ/లీటర్, సీఎన్జీతో 34.05 కి.మీ/కేజీ మైలేజీ వస్తుంది. 2025 ఫిబ్రవరిలో ఈ మోడల్ కార్లు 19,879 యూనిట్లు సేల్ అయ్యాయి.
టాప్- 1. మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) : ఈ కారును 2023 ఏప్రిల్ ఆటో ఎక్స్పో వేదికగా ఆవిష్కరించారు. మారుతికి చెందిన గ్రాండ్ విటారా, బలెనో కార్ల మోడళ్లకు చెందిన డిజైన్ అంశాలను మిళితం చేసి మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ను తయారు చేశారు. ఇందులో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంటుంది. వైర్లెస్ ఛార్జర్, 360 డిగ్రీల కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. ఈ కారు 100 హెచ్‌పీ బూస్టర్‌జెట్ టర్బో ఇంజిన్‌తో నడుస్తుంది. హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్‌లకు ప్రత్యర్థిగా మారుతి సుజుకి ఫ్రాంక్స్ తెచ్చారు. ఇది రూ.7.51 లక్షల నుంచి రూ.13.04 లక్షల ధరల శ్రేణిలో లభిస్తుంది. ఇందులోని పెట్రోల్ వెర్షన్‌తో 20.01 kmpl మైలేజీ వస్తుంది. సీఎన్జీ వెర్షన్‌తో 28.51 km/kg దాకా మైలేజీ వస్తుంది. 2025 ఫిబ్రవరిలో దీని అమ్మకాలు 51 శాతం పెరిగి 21,461 యూనిట్లకు చేరాయి.