ఐసీడీఎస్ ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడి సెంటర్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్లు 48 గంటల ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు కల్పన వైద్య మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికై 17, 18 తేదీల్లో రెండు రోజులు అంగన్వాడీ సెంటర్ ల బంద్ నిర్వహించి ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ఐసీడీఎస్ పథకం ప్రారంభమై 50 సంవత్సరాలు అవుతున్న సమస్యలు తీరడం లేదని అంగన్వాడీ టీచర్స్, మినీ టీచర్స్, హెల్పర్స్ ల సమస్యలను తక్షణమే పరిష్కరించి పర్మినెంట్ చేయాలని కోరారు.
అదే విధంగా ప్రతీ నెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని, మంత్రి సీతక్క ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడి టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ ప్రకారంగా 18 వేల వేతనం పెంచాలని, కాళీ పోస్టులన్నిటిని వెంటనే భర్తీ చేయాలని, ఐసీడీఎస్ ప్రాజెక్టుకు నిధులు పెంచి అంగన్వాడీలను బలోపేతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.