ఎనిమిది రోజుల పర్యటనకు వెళ్లి ఊహించని రీతిలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)లో చిక్కుకుపోయిన నాసా అంతరిక్ష వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భువికి చేరుకున్నారు. ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర జలాల్లో వ్యోమగాములు సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఫ్రీడమ్ వారిద్దరినీ సురక్షితంగా భూ వాతావరణంలోకి తీసుకువచ్చి ల్యాండ్ చేసింది. అప్పటికే సముద్రంలో వారి కోసం ఎదురుచూస్తున్న సహాయ బృందాలు వారిని క్యాంపుల్స్ నుంచి బయటకు తీశారు. ల్యాండింగ్ అనంతరం సునీత, విల్మోర్ను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు.
కాగా, ఎనిమిది రోజుల యాత్ర అనుకుని వెళ్లిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ సాంకేతిక కారణాల వల్ల దాదాపు తొమ్మది నెలల(286 రోజులు) పాటు ఐఎస్ఎస్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఈ 286 రోజుల్లో వారు ఎన్నిసార్లు భూమిని చుట్టారో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్లో వారు ప్రయాణించారు. దీని వల్ల ప్రతి రోజూ 16సార్లు భూమిని చుట్టేశారు. ఈ లెక్కన రోజుకు 16 సూర్యోదయాలు చూసేవారన్నమాట. వారికి ప్రతి 45 నిమిషాలకోసారి సూర్యోదయం అయ్యేది. మరో విషయం ఏంటంటే.. 286రోజులకు గానూ 4,500ల సార్లు వారు పుడమి చుట్టూ తిరిగారు. అలాగే 121 మిలియన్ స్టాట్యూట్ మైళ్లకు పైగా ప్రయాణించారు.