భానుడు మార్చి నుంచే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 10 దాటకముందే వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక ఎండలు మొదలయ్యాయి అంటే ఇంట్లో మూలన దాచిన కూలర్లు బయటికి వస్తాయి. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది వీటిని వినియోగిస్తారు. అయితే నెలల తర్వాత బయటికి తీసిన కూలర్‌ను కొద్దిమంది వెంటనే వాడేస్తుంటారు. మరికొద్దిమంది మాత్రం పైపైన దులిపి యూజ్ చేస్తుంటారు. కానీ కూలర్‌లను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత మాత్రమే వాడాలని నిపుణులు అంటున్నారు. లేదంటే నెలల తరబడి పేరుకుపోయిన దుమ్ము, ధూళి వల్ల పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి కూలర్‌ను ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
మోటార్ క్లీనింగ్: కూలర్ శుభ్రం చేసే ముందు దానికి మూడు వైపులా ఉండే కూలింగ్ ప్యాడ్స్‌ను రిమూవ్ చేయాలి. వీటిని తీసివేస్తే లోపల క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ముందుగా కూలర్ లోపల భాగాలను క్లీన్ చేసుకోవాలి. ఫ్యాన్ బ్లేడ్లు, మోటారుకు ఉన్న దుమ్ము, ధూళిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైన తడి గుడ్డతో ఫ్యాన్, మోటారుపై ఉన్న డస్ట్‌ను పూర్తిగా తుడిచి, లూబ్రికేటింగ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె తీసుకొని స్క్రూలు మొదలైన వాటిపై అప్లై చేయాలి. ఇది తుప్పును తొలగిస్తుంది, తద్వారా ఫ్యాన్ శబ్దం లేకుండా నడుస్తుంది.
వాటర్ ట్యాంక్: ఫ్యాన్, మోటార్ క్లీన్ చేసిన తర్వాత వాటర్ స్టోర్ చేసే ప్లేస్‌ను కూడా క్లీన్ చేయాలి. ఎందుకంటే వాటర్ నిల్వ చేయడానికి ముందు శుభ్రం చేయకపోతే, దానిలో పేరుకుపోయిన దుమ్ము నీటిలోకి చేరుతుంది. కాబట్టి ముందుగా కూలర్ లోపల క్లీన్ చేయాలి. దుమ్ము లేకుండా క్లీన్ చేసిన తర్వాత వెనిగర్ కలిపిన నీటిని లైట్‌గా స్ప్రే చేసి ఓ గంట తర్వాత ట్యాంక్‌ను క్లీన్ చేయాలి. దీంతో కూలర్ శుభ్రంగా మారడంతో పాటు దుర్వాసన రాకుండా ఉంటుంది.
కూలింగ్ ప్యాడ్స్: కూలర్ లోపల క్లీనింగ్ పూర్తయిన తర్వాత కూలింగ్ ప్యాడ్స్‌ను క్లీన్ చేయాలి. ప్యాడ్లకు ఉన్న గడ్డి తాజాగా ఉంటే దాన్ని అలానే ఉంచొచ్చు. ఒకవేళ అది పాడవుతే పాత గడ్డిని తీసేయాలి. ఆ తర్వాత ప్యాడ్స్‌పై దుమ్ము దులిపి ఓ తడి క్లాత్‌తో తుడవాలి. అనంతరం కొత్త గడ్డిని పెట్టి సెట్ చేసుకోవాలి. కొత్త గడ్డిని ఉపయోగించడం వల్ల ఫ్రెష్ ఎయిర్‌తో పాటు కూలింగ్ బాగా ఉంటుంది. ఇలా క్లీన్ చేసిన ప్యాడ్స్‌ను కూలర్‌కు జాయింట్ చేయాలి.
పెయింట్: కేవలం కూలర్ లోపల భాగాన్ని శుభ్రం చేయడమే కాదు. బయట కూడా క్లీన్ చేయాలి. ఎందుకంటే బయట ప్లేస్‌లో కూడా డస్ట్ పేరుకుపోతుంది. కాబట్టి ముందుగా బ్రష్ లేదా క్లాత్ సాయంతో పూర్తిగా దులిపి ఆపై తడి క్లాత్‌తో తుడవాలి. కొన్నికొన్ని కూలర్స్‌కు పెయింట్ పోతుంది. కాబట్టి కొత్తగా పెయింట్ వేసుకోవచ్చు. దీని వల్ల కూలర్ కొత్తదానిలా కనిపిస్తుంది. ఇక కూలర్ మొత్తాన్ని క్లీన్ చేసుకుని వాటర్ నింపి యూజ్ చేసుకుంటే సరి. ఇలా కూలర్‌లను వాడే ముందు క్లీన్ చేస్తే గాలి చల్లగా రావడమే కాకుండా ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని నిపుణులు చెబుతున్నారు.