మోసపూరిత, అవాంఛిత కాల్స్‌కు గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైంది. ట్రూకాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్‌ల అవసరం లేకుండానే మీ ఫోన్‌లోనే అవతలి వ్యక్తి పేరు చూపించే కాలర్ ఐడీ సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ఇందుకోసం ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సిద్ధమవుతున్నాయి. ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన సర్వర్లు, సాఫ్ట్‌వేర్‌ల కోసం హెచ్‌పీ, డెల్, ఎరిక్సన్, నోకియా వంటి ప్రముఖ వెండర్లను సంప్రదిస్తున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
కాలర్ ఐడీ సదుపాయాన్ని గతేడాది ఫిబ్రవరిలో తొలుత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ట్రాయ్ ప్రతిపాదించింది. ఆన్‌లైన్ మోసాలు, అవాంఛిత కాల్స్ పెరుగుతున్న వేళ దీన్ని వేగవంతంగా చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం టెలికాం ఆపరేటర్లకు సూచించింది. ఈ నేపథ్యంలో ఈ సదుపాయం అందించేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. దీనికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను నోకియా, ఎరిక్సన్ అందించనుండగా.. హెచ్‌పీ, డెల్ నుంచి సర్వర్లు పొందనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రయల్స్ కూడా కంపెనీలు నిర్వహించాయి.
ప్రస్తుతం ఇన్‌కమింగ్ కాల్స్ గుర్తించేందుకు ట్రూకాలర్ వంటి యాప్స్‌ను చాలా మంది వినియోగిస్తున్నారు. కాలర్ ఐడీ ఫీచర్ వచ్చాక ఈ తరహా యాప్స్ అవసరం ఉండదు. తొలుత ఆ నెట్‌వర్క్ యూజర్లు వినియోగదారుల పేర్లు మాత్రమే ప్రదర్శించన్నారు. అంటే జియో యూజర్ ఇంకో జియో యూజర్‌కు కాల్ చేసినప్పుడు మాత్రమే పేరు కనిపిస్తుందన్నమాట. కస్టమర్ డేటాను టెలికాం కంపెనీలు పంచుకోవడానికి అనుమతిస్తే పూర్తి స్థాయిలో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. అలాగే, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ పరిమితుల వల్ల ఫీచర్ ఫోన్లకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.