నచ్చినప్పుడొచ్చి ఇష్టానుసారంగా జైల్లో లొంగిపోతానంటే కుదరదని రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు హైకోర్టు తేల్చిచెప్పింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 11న సాయంత్రం 5 గంటలలోపు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో లొంగిపోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గడువులోగా ఎందుకు లొంగిపోలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బోరుగడ్డ విడుదలకు పూచీకత్తులు సమర్పించిన వారి వివరాలనూ తమ ముందు ఉంచాలని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. నకిలీ మెడికల్ సర్టిఫికెట్‌తో మధ్యంతర బెయిలు పొందడంపై తీవ్ర చర్చ జరుగుతున్నవేళ.. ఆ ఉత్తర్వులను మరోసారి పొడిగించాలని హైకోర్టును కోరడంపై మండిపడింది. కళ్లు మూసుకుంటే ఏదైనా చేస్తారని, బెయిలు పొడిగించాలని ఎన్నిసార్లైనా కోరతారని బోరుగడ్డను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. తల్లి అనారోగ్యం కారణాన్ని సాకుగా చూపుతూ నకిలీ మెడికల్ సర్టిఫికెట్‌తో మధ్యంతర బెయిలు పొందిన వ్యవహారంపై క్రిమినల్ కోర్టుధిక్కరణ కేసు నమోదు చేసి, విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
దీనిపై ప్రాథమిక విచారణ నివేదిక (ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్టు)ను సీల్డ్ కవర్లో హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడిషియల్) వద్ద దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. సంబంధిత డాక్టర్‌ను సైతం విచారిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు సోమవారం ఈ ఉత్తర్వులిచ్చారు. బోరుగడ్డ అనిల్ వైకాపా హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా పలువురు విపక్ష నాయకులు, వారి కుటుంబీకులను సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో తీవ్రస్థాయిలో దూషించాడు. ఓ కేసులో రాజమహేంద్రవరం కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్.. తన తల్లి పద్మావతి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారంటూ హైకోర్టులో నకిలీ మెడికల్ సర్టిఫికెట్ దాఖలు చేసి ఈ నెల 11 వరకు మధ్యంతర బెయిలు పొడిగించుకున్నాడు. మరోమారు బెయిలు పొడిగించుకునేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిన విషయం తెలిసిందే.
వివరాలిస్తే అవి కూడా తారుమారు చేసేస్తారా?
సోమవారం విచారణలో పోలీసుల తరఫున పీపీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు రాఘవశర్మ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇచ్చినట్లు అనిల్ తప్పుడు సర్టిఫికెట్ దాఖలు చేశాడన్నారు. దానిని తాను ఇవ్వలేదని రాఘవశర్మ పోలీసులకు చెప్పారన్నారు. గుంటూరు, చెన్నై ఆసుపత్రుల్లో పోలీసులు సేకరించిన వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు. ఈ నెల 11న అనిల్ జైల్లో లొంగిపోలేదన్నారు. నిందితుణ్ని ప్రాసిక్యూట్ చేయాలంటూ హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేశామన్నారు. బోరుగడ్డ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ దర్యాప్తు వివరాలు తమకిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఎందుకు.. వాటినీ తారుమారు చేయడానికా? అని న్యాయమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించారు.