Andhra pradesh

CM Chandrababu: 175 నియోజకవర్గాల్లోనూ జాబ్‌ మేళాలు

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ వచ్చే కలెక్టర్ల సదస్సులోగా జాబ్‌ మేళాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రతి మూడు, ఆరు నెలలకొకసారైనా జాబ్‌ మేళాలు జరగాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైనా ఇంకా నైపుణ్య గణన పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రక్రియ పూర్తయ్యేలోగా.. నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి జోన్‌కు ఒక ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీని నోడల్‌ ఏజెన్సీగా గుర్తించాలని ఆయన ఆదేశించారు. ఎలాంటి నైపుణ్యాలు కావాలన్న అంశంలో స్థానిక పరిశ్రమల భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వాలని తెలిపారు. వర్క్‌ ఫ్రం హోం విధానంలో పని చేసేందుకు నమోదు చేసుకున్నవారికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానంలో వెంటనే నైపుణ్య శిక్షణ ప్రారంభించాలని ఆదేశించారు. బుధవారం కలెక్టర్ల సదస్సులో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. క్లస్టర్‌ ఆధారిత విధానంలో ఇప్పటికే నైపుణ్య శిక్షణ ప్రారంభించామని తెలిపారు. నియోజకవర్గాల్లో మూడు నెలలకోసారి జాబ్‌ మేళాలు నిర్వహిస్తామన్నారు.

కోవూరు చక్కెర కర్మాగారం బకాయిలు రద్దు
నెల్లూరు జిల్లా కోవూరులోని చక్కెర కర్మాగారం 10-15 సంవత్సరాలుగా మూతపడిందని, ఆ భూమి విలువ ప్రస్తుతం రూ.250 కోట్లు ఉంటుందని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. సీఎం స్పందిస్తూ ఆ కర్మాగారానికి చెందిన 124 ఎకరాల భూమిని ఏపీపీఐఐసీ స్వాధీనం చేసుకుని, వేరే పరిశ్రమలకు కేటాయిస్తుందని చెప్పారు. ఆ కర్మాగారం ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.140 కోట్ల బకాయిల్ని రద్దు చేస్తామని.. రైతులకు, ఉద్యోగులకు బకాయిపడ్డ రూ.28 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడించారు. ‘ప్రొడక్ట్‌ పర్ఫెక్షన్‌’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన రూ.1.6 కోట్లతో తమ జిల్లాలోని మామిడి రైతులకు ఫ్రూట్‌ కవర్లు అందజేయడం వల్ల దిగుబడి నాణ్యత పెరిగి, మంచి ఫలితాలు వచ్చాయని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. ‘ఒక్కో కవర్‌కు రూ.2.25 ఖర్చవుతుంటే, మనం రాయితీగా రూపాయి ఇస్తున్నాం. దీనికి రైతుకు రూ.9 అదనపు ఆదాయం వస్తోంది’ అని వివరించారు. సీఎం స్పందిస్తూ.. వచ్చే సంవత్సరం నుంచి సగం ఖర్చు ప్రభుత్వమే భరించడం ద్వారా రాష్ట్రంలో రైతులందరూ ఫ్రూట్‌ కవర్లు వినియోగించేలా ప్రోత్సహించాలన్నారు. మామిడితో మొదలుపెట్టి, మిగతా ఉద్యాన పంటలకూ దీన్ని విస్తరిద్దామని తెలిపారు.

నరేగా డబ్బుతో పశువుల గడ్డి పెంపకం
రాష్ట్రంలో పెద్ద ఎత్తున పశువుల పెంపకం, పాల ఉత్పత్తిని పెంచడం ద్వారా గ్రామాల్లో పేదరిక నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. గడ్డి పెంచి, ఇంటింటికీ సరఫరా చేయడమే కాక యంత్రాలతో పాలు పితికే బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని, గడ్డి పెంచేందుకు నరేగా నిధుల్ని వినియోగించాలని సూచించారు.

అత్యంత నివాసయోగ్యమైన, ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతి
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, అత్యంత నివాసయోగ్యమైన నగరంగానూ తిరుపతిని అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. చాలా మంది అయోధ్యలో స్థలం కొనుక్కుని, ఇల్లు కట్టుకుని నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని, తిరుపతిలోనూ నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునేవారున్నారని పేర్కొన్నారు. తిరుపతిలో పెద్ద సంఖ్యలో హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, కల్యాణ మండపాలు నిర్మించాలన్నారు. తిరుపతిలో ఇప్పటికే 3,500 హోటల్‌ గదులున్నాయని, మరో వెయ్యి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఆ జిల్లా కలెక్టర్‌ చెప్పగా… అవి సరిపోవని 10 వేల వరకు హోటల్‌ గదుల అవసరం ఉందని సీఎం తెలిపారు.

మామిడి అభివృద్ధి బోర్డు ఏర్పాటుకు కృషి
చిత్తూరు జిల్లాలో మామిడి అభివృద్ధి బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని సీఎం తెలిపారు. సిల్క్‌ రీసెర్చ్‌ సెంటర్, కుప్పంలో కేంద్రీయ విద్యాలయం, తిరుపతి జిల్లాలో ఇన్‌ల్యాండ్‌ కంటెయినర్‌ పోర్టు ఏర్పాటుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

ప్రభుత్వంపై సానుకూల భావన ఏర్పడేలా ఉండాలి
కలెక్టర్లు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేసేటప్పుడు పొలిటికల్‌ గవర్నెన్స్‌ను దృష్టిలో ఉంచుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఫలితాలు చివరి వరకు అంది, ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడేలా పని చేయాలని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల, ఏలూరు జిల్లాలో కోతుల సమస్య నియంత్రణపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు.

Related posts

Pastor Praveen : పాస్టర్ ప్రవీణ్ ను గుద్దిన కారు అదే.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

Xloro News

Jayamangala చంద్రబాబు కాళ్ల మీద పడ్డ వైపీసీ మాజీ నేత

Xloro News

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మాజీ సీఎం జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

Xloro News

Leave a Comment