రాష్ట్రంలో 93 వేల మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కొత్తగా దాదాపు 5 లక్షల మంది పింఛన్లకు అర్హులుగా ఉన్నారు. వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తాం. ఉపాధి కల్పన, మహిళల స్వయం సాధికారత, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మండలాన్ని ఓ యూనిట్‌గా తీసుకుని విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నాం. స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మండలానికి ఒక మహిళా భవనం నిర్మించి, దాన్ని శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతాం. పేదరిక నిర్మూలనకు నిరుపేద కుటుంబాలను దాతలకు అప్పగించి, వారి ద్వారా మెరుగైన జీవన విధానం అందేలా చర్యలు తీసుకోనున్నాం’’ అని పేర్కొన్నారు.
