హైదరాబాద్‌లో 2023లో సంచలం సృష్టించిన సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో దోషికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. పెళ్లి చేసుకోమని అప్సర అడగడంతో పూజారి వెంకట సాయి కృష్ణ ఆమెను కారులో శంషాబాద్ తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన ఇంటి సమీపంలో డ్రైనేజీలో మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. మ్యాన్‌హెల్‌ను మట్టితో పూడ్చి తర్వాత సిమెంట్‌తో మూసివేశాడు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు సాయి కృష్ణకు జీవిత ఖైదు, రూ.10వేల జరిమానాతో పాటు సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్లు జైలు శిక్షను విధించింది.
పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసి : 2022లో సినిమాలు, సీరియళ్లలో నటించేందుకు చెన్నై నుంచి హైదరాబాద్‌కు అప్సర అనే యువతి తల్లితో పాటు వచ్చింది. వీరు సరూర్‌నగర్‌లో నివసిస్తున్నారు. అదే ప్రాంతంలో బంగారు మైసమ్మ ఆలయంలో పూజారిగా పని చేస్తున్న వెంకట సాయికృష్ణతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్సర ఆలయానికి తరచూ వెళ్లి వస్తుండటంతో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటికే సాయి కృష్టకు వివాహం అయి ఓ కుమార్తె కూడా ఉంది. అతను తరచూ యువతి ఇంటికి రాకపోకలు సాగించేవాడు. అయితే తనను పెళ్లి చేసుకోమని అప్సర, సాయికృష్ణను ఒత్తిడి చేసేది. ఈ క్రమంలో ఆమెను ఏదో విధంగా అడ్డు తొలగించుకోవాలని అతను భావించాడు. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
ప్లాన్ ప్రకారం : 2023 జూన్ 3న కోయంబత్తూరు వెళ్దామని అప్సరను నమ్మించి, విమాన టికెట్లు కొనుగోలు చేశానని వెంకటసాయికృష్ణ చెప్పాడు. నిజమేననుకున్న ఆమె లగేజీ సహా ప్రయాణానికి సిద్ధమైంది. అప్సర తనపనిపై కోయంబత్తూరు వెళ్తోందని, ఆమెను శంషాబాద్ వద్ద దింపివస్తానంటూ ఆమె తల్లికి చెప్పాడు. ఆరోజు రాత్రి 8.15 గంటలకు సాయికృష్ణ, అప్సర కారులో సరూర్‌నగర్ నుంచి బయల్దేరారు. రాత్రి 10 గంటల సమయంలో శంషాబాద్ మండలం రాళ్లగూడలోని ఒక హోటల్‌లో భోజనం చేశారు. రాత్రి 11 గంటలకు సుల్తాన్‌పల్లిలోని గోశాల వద్దకు వెళ్లారు. అక్కడ కొంతసేపు గడిపారు. గోశాలలో బెల్లం దంచే రాయిని ఆమె కంటబడకుండా అతడు కారులో పెట్టాడు.
కవర్ కప్పి రాయితో కొట్టి : 4న తెల్లవారుజామున 3.50 సమయంలో గోశాల సమీపంలోని నర్కుడలో ఓ ఖాళీ వెంచర్ వద్దకు వెళ్లారు. ఆమె నిద్రలోకి జారుకోగానే కారు సీటు కవర్ తీసి ఆమె ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేశాడు. బెల్లం దంచే రాయితో తల వెనుక భాగంలో పదిసార్లు బలంగా బాదడంతో మృతిచెందింది. మృతదేహంపై కారు కవర్ కప్పాడు. అక్కడి నుంచి సరూర్‌నగర్‌లోని తన ఇంటికి చేరుకుని, మృతదేహం ఉన్న కారును అక్కడే పార్కు చేశాడు. ఏమీ తెలియనట్టుగా తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు.
మ్యాన్‌హోల్‌లో వేసి మట్టితో పూడ్చి : రెండ్రోజుల పాటు కారులో ఉన్న అప్సర మృతదేహాన్ని కవర్‌లో చుట్టి సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్‌హోల్‌లో పడేశాడు. దుర్వాసన వస్తోందంటూ ఎల్బీనగర్ నుంచి అడ్డా కూలీలను పిలిపించి, రెండు ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి మ్యాన్‌హోల్‌ను కప్పి సిమెంట్‌తో పూడ్పించాడు.