మండుతున్న ఎండల్లో రాష్ట్ర ప్రజలకు చల్లటి శుభవార్తను అమరావతి వాతావరణశాఖ వినిపించింది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
అలాగే గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, తీర ప్రాంతాల్లో నివసించేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. ఈ తరహా వాతావరణం ఈ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉంది. దీంతో ప్రజలు హమ్మయ్య అనుకుంటున్నారు. కొద్దిరోజులుగా ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ వార్తతో వర్షం కురవకుండానే వారిపై చల్లటి జల్లులు పడినట్లైంది.
బలహీనపడిన ద్రోణి
బంగాళాఖాతంలో ఒడిసా రాష్ట్రం నుంచి దక్షిణ విదర్భ వరకు ద్రోణి ఏర్పడింది. చత్తీస్ గడ్ వరకు విస్తరించిన ఈ ద్రోణి బలహీనపడింది. దీంతో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావం వల్లే నాలుగు రోజులపాటు ఏపీలో వర్షాలతోపాటు చల్లటి వాతావరణం నెలకొననుంది. రాయలసీమలో తేలికపాటి నుంచి సాధారణ వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తాలో మోస్తరు వానలు, ఉరుములు, పిడుగులు పడతాయి. ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలతోపాటు తేలికపాటి జల్లులు పడతాయి. ఏపీతోపాటు తెలంగాణలో కూడా వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులతో భారీ వాన కురిసింది. 23వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి
రెండు రాష్ట్రాల్లోను వేసవికాలం రాకుండానే మార్చి నెలలో ఎండలు మండిపోతుండటంతోపాటు కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 40.9, 40.6 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతింటాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలులకు కాపుకొచ్చిన దశలో మామిడికాయలు రాలిపోయాయి. అలాగే విత్తనాలు వేసి పంట మొలకెత్తే సమయంలో ఈ నెలాఖరు వరకు వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలపడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.