RBI | దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank)కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించని కారణంగా భారీ ఫైన్ వేసింది. ఈ మేరకు ఆర్బీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కేవైసీ (KYC)కి సంబంధించి 2016లో ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించని కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు రూ.75 లక్షల జరిమానా విధించినట్లు ప్రకటనలో వెల్లడించింది. 2023 మార్చి 31న బ్యాంకులో నిర్వహించిన పరిశీలనలో లోపాలను గుర్తించినట్లు పేర్కొంది. కస్టమర్లను రిస్క్‌ల వారీగా విభజించకపోవడం, యునిక్ కస్టమర్ కోడ్ జారీ చేయాల్సిన చోట ఒకే ఐడెంటిఫికేషన్ కోడ్‌ను పలువురికి కేటాయించడం వంటి లోపాలను తాము గుర్తించినట్లు ఆర్బీఐ తెలిపింది.