కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ (Vikram) నటించిన కొత్త చిత్రం ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ (Veera Dheera Sooran part2). దుషారా విజయన్ (Dushara Vijayan), ఎస్.జె. సూర్య (SJ Suryah) కీలక పాత్రలు పోషించారు. ఎస్.యు.అరుణ్‌కుమార్ దర్శకత్వం వహించారు. గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సిఉండగా.. అనివార్య కారణాల వల్ల చిక్కుల్లో పడింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా చాలా మల్టీప్లెక్సుల్లో ఈ సినిమా మార్నింగ్ షోలు రద్దు అయ్యాయి. అంతేకాకుండా యూఎస్ ప్రీమియర్స్‌కూ అంతరాయం ఏర్పడింది. దీంతో విక్రమ్ అభిమానులు నిరాశ వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు, మార్నింగ్ షోలు రద్దు కావడంతో డబ్బులు తిరిగి ఇచ్చేస్తామంటూ ఆయా థియేటర్ల యాజమాన్యం సినీ ప్రియులకు సందేశాలు పంపిస్తుంది.
ఓటీటీ హక్కుల విషయంలో ఈ సినిమా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముంబయికి చెందిన ఒక పేరొందిన నిర్మాణసంస్థ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఓటీటీ హక్కులు అమ్ముతామంటూ తమకు ఇచ్చిన ఒప్పందాన్ని చిత్ర నిర్మాతలు పక్కనపెట్టారని ఆ సంస్థ ఆరోపించింది. దీంతో సినిమా రిలీజ్‌ను కొన్ని గంటల పాటు వాయిదా వేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈక్రమంలోనే చాలా ప్రాంతాల్లో మార్నింగ్ షోస్ రద్దయ్యాయని స్థానిక పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.
‘తంగలాన్’ తర్వాత విక్రమ్ నుంచి వస్తోన్న చిత్రమిది. ‘వీర ధీర శూరన్’ (Veera Dheera Sooran part2) చిత్రాన్ని ‘వీర ధీర శూర పార్ట్ 2’గా విడుదల చేస్తున్నారు. పార్ట్ 1 విడుదల కాకుండానే పార్ట్ 2 విడుదల చేయడంపై ఇటీవల చిత్రబృందం స్పందించింది. ‘‘అలా చేయడానికి ఒక కారణం ఉంది. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ కథలో ఒక అందమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంది. దానిని మేము పార్ట్ 1లో చూపిస్తాం. అది లవ్‌స్టోరీ’’ అని విక్రమ్ ఇటీవల ప్రెస్‌మీట్‌లో చెప్పారు.