Politics

రికార్డుస్థాయిలో పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు 13 లక్షల మంది గుర్తింపు దరఖాస్తుదారుడి ఇంటికి సిబ్బంది

Published

on

188 Views

హైదరాబాద్‌, అక్టోబర్‌ 17 ( నేటి భారత్ ): రాష్ట్రంలో ఈసారి రికార్డుస్థాయిలో పోస్టల్‌ ఓట్లు నమోదు కానున్నాయి. అభ్యర్థుల గెలుపోటముల్లో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి దాదాపుగా 13 లక్షల మందిని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకు గుర్తించారు. దివ్యాంగులు, 80 ఏండ్లు పైబడిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌కు అవకాశం కల్పించడమే దీనికి ప్రధాన కారణం. గతానికి భిన్నంగా ఈసారి ఉద్యోగుల కోసం వారి ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ప్రత్యేకంగా పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ఇందుకు ఎన్నికల అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో దివ్యాంగులు 5.06 లక్షల మంది, 80 ఏండ్లు పైబడిన వారు 4.44 లక్షలు, 100 ఏండ్లు పైబడిన వారు 7 వేలకు పైగా, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు 2.01 లక్షలు, పోలీసులు దాదాపుగా లక్షకు పైగా ఉన్నారు. వీరితోపాటుగా అత్యవసర సర్వీసుల్లో పనిచేసే వారు 33 వేల మంది, సర్వీసు ఓటర్లు 15 వేలు మొత్తం 12,95,007 మందిని పోస్టల్‌ బ్యాలెట్‌కు అర్హులుగా తేల్చారు.

గతంలో కేవలం ఎన్నికల విధుల్లో ఉన్న వారికి, సర్వీసు ఓటర్లకు మాతమ్రే పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం ఉండేది. కానీ, కరోనా నాటి నుంచి దివ్యాంగులు, 80 ఏండ్లు పైబడిన వారికి ఈ అవకాశం కల్పించారు. దీంతో పోస్టల్‌ ఓట్లు ఉపయోగించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. లక్షల్లో ఓట్లు ఉండటంతో అభ్యర్థుల గెలుపోటముల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈసారి అభ్యర్థులు ప్రత్యేకంగా పోస్టల్‌ బ్యాలెట్లపై దృష్టి సారించే అవకాశం ఉంది.

దరఖాస్తు చేసుకుంటేనే..

పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకోవాలనుకునే వారు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన 5 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణలో నవంబర్‌ 3న నోటిఫికేషన్‌ విడుదల కానున్నది. నవంబర్‌ 8 వరకు ఫారం-12డీ ద్వారా దరఖాస్తు చేయాలి. దివ్యాంగులు, వయోవృద్ధులు స్థానికంగా ఉండే బీఎల్‌వోల ద్వారా, ఉద్యోగులు వారి కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పిస్తారు. వయోవృద్ధులు వారి వయసును ధ్రువీకరించే పత్రాలు జతచేయాలి. దివ్యాంగులు 40% కంటే వైకల్యం ఉన్నట్టుగా ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. వయోవృద్ధులు, దివ్యాంగులు ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు? అనేది పోలింగ్‌ స్టేషన్ల వారీగా రిటర్నింగ్‌ అధికారి మ్యాపింగ్‌ చేస్తారు. ఏ గ్రామంలో, ఏ పోలింగ్‌ బూత్‌లో, ఏ రోజు పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ నిర్వహించేది రాజకీయ పార్టీలకు కూడా సమాచారం అందిస్తారు.

రహస్యంగా ఓటు వేసేలా..

పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం పోలింగ్‌ స్టేషన్‌కు ఒక బృందాన్ని రిటర్నింగ్‌ అధికారి నియమిస్తారు. ఈ బృందంలో మైక్రో అబ్జర్వర్‌, బీఎల్‌వో, వీడియోగ్రాఫర్‌ ఉంటారు. వారి ఇండ్లకు వెళ్లి, అక్కడ కంపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేసి రహస్యంగా ఓటు వేసేలా చూస్తారు. ఇలా ప్రతి ఓటుకు సంబంధించిన ఓటింగ్‌ ప్రక్రియను వీడియో రికార్డ్‌ చేస్తారు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులకు వారికి ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ వేయడానికి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడే ఓటు ఇస్తారు. అక్కడే ఓటు వేయాలి. గతంలో ఉద్యోగుల ఓటు హక్కు విషయంలో వచ్చిన ఫిర్యాదులతో ఒకే దగ్గర ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ అంతా నామినేషన్‌ ఉపసంహరణ ప్రక్రియ తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్‌ ముద్రించాక ప్రారంభమవుతుంది.

ఎన్నికల కంటే ముందే..

ఈ ప్రక్రియను ఎన్నికల తేదీ నవంబర్‌ 30 కంటే ముందుగా ముగిస్తారు. వీటన్నింటిని రిటర్నింగ్‌ అధికారి భద్రపరిచి, ఆ తర్వాత స్ట్రాంగ్‌రూంకు తరలిస్తారు. ఎన్నికల కౌంటింగ్‌లో ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారు పోలింగ్‌ బూతులో ఓటు వేస్తామంటే నిబంధనలు అంగీకరించవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version