Andhrapradesh
జగన్ రాకతో… ప్రజాధనం దుర్వినియోగం: టిడిపి.
సభలో… సాగునీటి ప్రాజెక్టుల ఊసే లేదు.
ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి తనయుడు టిక్కెట్ కోసం ఉన్న ఆరాటం, నియోజకవర్గ అభివృద్ధిపై లేదు.
జగనన్న చేదోడు పథకం కింద నాలుగో విడత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగనూరుకు రావడంతో ప్రజాధనం దుర్వినియోగం అయింది తప్ప ఒరిగింది ఏమీ లేదని టిడిపి నేతలు మండిపడ్డారు.
మాజీ కేంద్ర మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం టిడిపి నేతలు స్థానిక కోట్ల క్యాంపు కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభలో సీఎం జగన్ పెండింగ్ ప్రాజెక్టులైన వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం, ఎల్. ఎల్.సి. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పనుల గురించి ప్రస్తావించకపోవడం కర్నూలు జిల్లా పై ఆయనకు ఉన్న ప్రేమ ఏ పాటిదో స్పష్టంగా అర్థమైందన్నారు. స్థానిక శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి హంద్రీ నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలన్న వినతి మినహాయిస్తే..! ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అడిగింది శూన్యమన్నారు.
తనయుడు టికెట్ కోసం ఉన్న ఆరాటం అభివృద్ధిపై లేకపోవడం శోచనీయమన్నారు. ఎమ్మిగనూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాజులదిన్నె ప్రాజెక్టు నుండి ఎమ్మిగనూరు పట్టణానికి 86 కీ. మీ. మేరకు పైప్ లైన్ ద్వారా త్రాగునీటి ప్రాజెక్టును ఏ.ఐ.ఐ.బి. పథకము ద్వారా రూ.148 కోట్లు నిధులను టిడిపి హాయంలో మంజూరు చేయించడం జరిగిందని, అలాగే చేనేతల ఉపాధికై 2015 మే 2 న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేత బనవాసి గ్రామంలో టెక్స్ టైల్స్ పార్కు కోసం 91.31 ఎకరములను భూమి కేటాయించి నిధులు కేటాయిస్తే దీనిని ఇతర జిల్లాలకు వైసిపి ప్రభుత్వం తరలించిందని వీటి అమలుకు విన్నవించకపోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.
అసంపూర్తిగా ఉన్న నాగలదిన్నె బ్రిడ్జిని సీఎం జగన్ పూర్తి చేశారని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చెప్పడంలో వాస్తవం ఏమాత్రం లేదన్నారు. నాగలదిన్నె బ్రిడ్జి పునర్నిర్మాణం కోసం కాంగ్రెస్ సహాయంలో అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి చొరవతో రూ.42 కోట్లు విడుదల చేయించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఎమ్మిగనూరు పట్టణంలో..100 పడకల ఆసుపత్రి టిడిపి హాయంలోనే మంజూరు అయిందని పేర్కొన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి అభివృద్ధి వరాలు కురిపించకుండా ఊకదంపుడు ప్రసంగం చేయడంతో ఒరిగింది జరిగింది ఏమీ లేదని దుయ్యపడ్డారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు సహకారంతో.. మాజీ కేంద్రమంత్రి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కదిరికోట ఆదెన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప్ప ర (సగర) ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు, మాసుమాన్ దొడ్డి శ్రీనివాసులు, తెలుగు మహిళా నాయకురాలు గోకారమ్మ, టిడిపి ముస్లిం మైనార్టీ నాయకులు కె.యం.డి. అబ్దుల్ జబ్బార్,ఆఫ్గాన్ వలిభాష, టిడిపి ఎస్సీ సెల్ నాయకులు దర్జీ మోషన్న,యస్.సాల్మన్, జాలవాడి ఏసన్న, పందికోన సురేష్, కె. తిమ్మాపురం గ్రామ నాయకులు కురువ వీరేష్, మార్కు తదితరులు పాల్గొన్నారు.